జాకియా ఖానమ్ బిజెపిలో చేరిక – ఏపీలో రాజకీయ పరినామాలకు నాంది
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్‌పర్సన్ జాకియా ఖానమ్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే కౌన్సిల్‌లో తన పదవికి రాజీనామా చేశారు. ఆమె బీజేపీలో చేరే నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఖానమ్ రాజీనామా, బీజేపీలో చేరిక రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
బీజేపీలో ఘన స్వాగతం
ఖానమ్ బీజేపీలో చేరడం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఎంపీ డాక్టర్ పురందేశ్వరి, కేంద్ర మంత్రి వై. సత్యకుమార్, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, బీజేపీ నేత పార్థ సరథి తదితరులు స్వాగతం పలికారు. ఖానమ్ చేరికపై స్పందించిన పురందేశ్వరి – “ఆమె నిర్ణయం బీజేపీ సిద్ధాంతానికి అనుగుణంగా ఉంది. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' నినాదాన్ని ప్రతిబింబిస్తుంది,” అన్నారు.
నరేంద్ర మోడీ నాయకత్వానికి మన్ననలు
బీజేపీలో చేరిన అనంతరం ఖానమ్ మాట్లాడుతూ – “దేశానికి, మహిళల భద్రతకు, మైనారిటీల సంక్షేమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న సేవలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆయన నాయకత్వం దేశ భవిష్యత్తును మారుస్తోంది,” అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆమె బీజేపీ వైపు మొగ్గు చూపడానికి ముఖ్య కారణంగా నిలిచినట్లు స్పష్టం చేసింది.
రాజకీయ ప్రస్థానం – వైఎస్సార్‌సిపి నుంచి బీజేపీ వరకు
జాకియా ఖానమ్ 2020లో గవర్నర్ నామినేషన్ ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆ తరువాత డిప్యూటీ చైర్‌పర్సన్ హోదా దక్కించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఆమె, ఇటీవల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన భారీ దెబ్బ తరువాత పార్టీకి దూరంగా వ్యవహరించసాగారు. చివరికి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
బీజేపీకి కీలక బలం
ఖానమ్ చేరిక బీజేపీకి ముఖ్య మైనారిటీ మహిళా నాయకురాలిగా మద్దతును పెంచుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముస్లిం వర్గాల్లో మద్దతును బలోపేతం చేయడంలో ఆమె పాత్ర కీలకమవుతుందని అంచనా. ఏపీలో బీజేపీ పొత్తుల రాజకీయాల్లో కీలక మలుపుగా ఇది భావించబడుతోంది.
Post a Comment