-->

మద్యం మాఫియా మారణహోమం – జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపుల బీభత్సం

 

మద్యం మాఫియా మారణహోమం – జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపుల బీభత్సం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం మాఫియా పెట్రోలుపోసినట్లు అలజడి సృష్టిస్తోందని, నియంత్రణ లేకుండా బెల్ట్ షాపులు పుట్టలు పొడిచినట్లు విస్తరిస్తున్నాయని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్సీ) జిల్లా అధ్యక్షుడు మారెల్లి విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ బెల్ట్ షాపులు, అనధికారిక మద్యం విక్రయ కేంద్రాలు గ్రామాల నాకోణాల దాకా విస్తరించాయని ఆయన ఆరోపించారు.

ఇప్పుడు గ్రామాల్లో కూడా మద్యం ‘తాగేవాడికి తాగేటంతే’ అందుబాటులో ఉందని, కిరాణా దుకాణాల నుంచి ఏజెన్సీ ప్రాంతాల వరకు మద్యం విక్రయం ఎక్కడ చూసినా కనిపిస్తోందని తెలిపారు. ఇది గ్రామీణ ప్రజల జీవనశైలి, కుటుంబ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ధరల దందా – ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలు

ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు తలదాచుకుంటున్నారని విమర్శించారు. ఎక్సైజ్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా, అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడం దారుణమని పేర్కొన్నారు.

బెల్ట్ షాపుల ప్రభావం – కుటుంబాలలో విషాదం

బెల్ట్ షాపుల వల్ల యువత అప్పుల్లో కూరుకుపోతుండటం, మహిళలు వేధింపులకు గురవటం, కుటుంబాలు విచ్ఛిన్నమవటం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఇది సమాజపు నాడిని కుదింపేసే పరిస్థితి అని హెచ్చరించారు.

కఠిన చర్యలతోనే పరిష్కారం 

ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తక్షణ చర్యలు అవసరమని మారెల్లి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన సూచనలు ఇలా ఉన్నాయి:

  • బెల్ట్ షాపులపై పూర్తిగా నిషేధం విధించాలి
  • నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • ప్రజల ఫిర్యాదులకు స్పందించే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి

ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని, మద్యం మాఫియాపై కఠినంగా వ్యవహరించాలంటూ అధికారులు మేల్కొనాలని విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.