నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోరుతూ 12 ఫిబ్రవరి 2026న దేశవ్యాప్త సమ్మె
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడీకి సమ్మె నోటీసు అందజేత
దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 12-02-2026 రోజున కార్మికులు, ఉద్యోగులు చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న వంట కార్మికులు కూడా పాల్గొననున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ డైరెక్టర్ (ఏడీ) గారికి సమ్మె నోటీసును అందజేశారు.
ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం వంట కార్మికులు తమ ప్రధాన డిమాండ్లను అధికారులకు తెలియజేశారు. వంట కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ.26,000లు నిర్ణయించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే నెలకు కనీస పెన్షన్ రూ.9,000లు ఇవ్వాలని కోరారు.
మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న వర్కర్లకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ప్రతి విద్యార్థికి తరగతితో సంబంధం లేకుండా మెనూ చార్జీలను రూ.25లకు పెంచాలని లేదా నిత్యవసర సరుకులు, గ్యాస్, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వంట కార్మికులకు సంవత్సరానికి 12 నెలల వేతనాలు చెల్లించాలని కూడా కోరారు.
అదేవిధంగా మధ్యాహ్న భోజనం కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెలో పాల్గొంటున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, మండలాల నాయకురాలు కాంత, శిరీష, అరుణ, రమణ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment