ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియురాలు
నల్లగొండ జిల్లాలో దారుణ హత్య చిన్నారిని విసిరేసి పరారైన నిందితురాలు – పోలీసులకు లొంగిపోవడంతో వెలుగులోకి వచ్చిన ఘోరం
నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలం : నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడి భార్యను పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన ఘటన నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం… కేతపల్లి గ్రామానికి చెందిన నగేష్ యాదవ్ అనే వ్యక్తికి ఇప్పటికే పెళ్లి కాగా, అతనికి ఒక కూతురు ఉంది. ఇదే సమయంలో సుజాత అనే మహిళతో అతడు వివాహేతర సంబంధం కొనసాగించాడు. సుజాతకు కూడా ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలో తన ఇద్దరు కూతుర్లలో ఒకరిని నగేష్ యాదవ్‌కు పెళ్లి చేయాలని సుజాత అతడిపై ఒత్తిడి తెచ్చింది. అయితే నగేష్ దీనికి అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది.
వివాదం తారాస్థాయికి చేరడంతో ఆగ్రహానికి గురైన సుజాత, నగేష్ ఇంటికి వెళ్లి చంటి బిడ్డకు పాలిస్తున్న అతని భార్య మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో మంటలు అంటకుండా చిన్నారిని దూరంగా విసిరేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో మమత అక్కడికక్కడే మృతి చెందింది.
అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రస్తుతం చావు–బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ దారుణానికి పాల్పడిన నిందితురాలు సుజాత అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి స్వయంగా లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెపై హత్యతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

Post a Comment