-->

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి

మరణంలోనూ వీడని స్నేహం… రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి


జనగామ జిల్లా | విషాదం: ప్రాణ స్నేహం మరణానికీ విడిపోని విషాద ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. పాలకుర్తి మండలం శాతపురం గ్రామానికి చెందిన గన్న ఆనంద్, సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన రాకేష్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

రాకేష్ అమ్మమ్మ ఊరు శాతపురం కావడంతో చిన్ననాటి నుంచే అక్కడే పెరిగాడు. ఆ సమయంలో ఆనంద్‌తో ఏర్పడిన స్నేహం కాలంతో మరింత గాఢంగా మారింది. ప్రస్తుతం ఇద్దరూ హైదరాబాద్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

నిన్న ఆనంద్ పుట్టినరోజు కావడంతో స్వగ్రామానికి వచ్చిన వారు, అనంతరం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు కారులో వెళ్లి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. తిరిగి గ్రామానికి చేరుకున్న తర్వాత కారును అక్కడే వదిలి, బైక్‌పై హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఈ క్రమంలో భువనగిరి బ్రిడ్జి వద్ద బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. బైక్ బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఇద్దరు యువకుల ఆకస్మిక మృతితో శాతపురం, తిరుమలగిరి గ్రామాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. పోస్టుమార్టం గది వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు హృదయాలను కలిచివేశాయి. ఒక్కసారిగా ఆస్పత్రి ప్రాంగణం కన్నీటి మయం అయింది.

ప్రాణ స్నేహితులు ఒకే ప్రమాదంలో ప్రాణాలు విడిచిన ఈ ఘటన అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది.“మరణంలోనూ వీడని స్నేహం” అంటూ గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793