తెలంగాణలో మళ్లీ ఎన్నికలు... రెండు విడతలుగా పరిషత్ పోలింగ్?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను మార్చి నెలలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా వస్తే అదే ఊపులో పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
మునిసిపల్ ఫలితాలపై ఆధారపడి నిర్ణయం
ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉంటే రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా ఉన్న వేళనే పరిషత్ ఎన్నికలను నిర్వహించడం గెలుపుకు దోహదం చేస్తుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. రేపటి ఫలితాల అనంతరం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
కేంద్ర నిధుల కోల్పోయే ప్రమాదం
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిషత్ ఎన్నికలు జరగకపోతే జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు రూ.450 కోట్ల నిధులు నిలిచిపోవచ్చని సమాచారం. ఈ నిధులు మురిగిపోకుండా ఉండేందుకు ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మార్చి తొలి వారంలోనే షెడ్యూల్?
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం మార్చి తొలి వారంలోనే రెండు విడతలుగా జిల్లా మరియు మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఎన్నికల హడావిడి మొదలయ్యేలా పరిస్థితులు మారుతున్నాయి.

Post a Comment