కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజున కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకున్నారు.
భేటీ సందర్భంగా ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు వివరాలను సీఎం వివరించారు. ఈసా–మూసీ నదుల సంగమ స్థలంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. 1948లో మహాత్మా గాంధీ చితాభస్మాన్ని ఇదే ప్రాంతంలో నిమజ్జనం చేసిన చారిత్రక ప్రాముఖ్యత ఉన్నదని గుర్తు చేశారు.
అలాగే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయి చిహ్నంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా చారిత్రక, పర్యాటక ప్రాధాన్యతను మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.

Post a Comment