-->

సింగరేణి ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. జ్యోతి బుద్ధ ప్రకాష్ బాధ్యతల స్వీకరణ

సింగరేణి ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. జ్యోతి బుద్ధ ప్రకాష్ బాధ్యతల స్వీకరణ


హైదరాబాద్, ఫిబ్రవరి 12: సింగరేణి కొలియర్ీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గురువారం ఉదయం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో అధికారిక బాధ్యతలు స్వీకరించారు.

ఉదయం సింగరేణి భవన్‌కు విచ్చేసిన డా. జ్యోతి బుద్ధ ప్రకాష్‌కు సంస్థ జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ & మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం ఛైర్మన్ కార్యాలయంలో ఆయన అధికారికంగా బాధ్యతలను చేపట్టారు.

ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు ఆయనను కలసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) గౌతం పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలపై డైరెక్టర్లు సంక్షిప్తంగా వివరణ ఇచ్చారు.

డా. జ్యోతి బుద్ధ ప్రకాష్ 2002 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన ఇటీవల తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా సేవలందించారు. అంతకుముందు రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శిగా విశిష్ట సేవలు అందించారు. సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో కూడా పలు కీలక హోదాల్లో పనిచేశారు. అదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

సీనియర్ అధికారిగా మంచి పేరు గడించిన డా. జ్యోతి బుద్ధ ప్రకాష్ సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించడంపై సంస్థ వర్గాల్లో మరియు ఉద్యోగుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793