-->

అరుదైన ఘటన 5.2 కిలోల బరువుతో మగ శిశువు జన్మించడం సంచలనంగా మారింది

అరుదైన ఘటన 5.2 కిలోల బరువుతో మగ శిశువు జన్మించడం సంచలనంగా మారింది


భద్రాద్రి రామయ్య కొలువై ఉన్న భద్రాచలంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 5.2 కిలోల బరువుతో ఓ మగ శిశువు జన్మించడం స్థానికంగా సంచలనంగా మారింది.

సాధారణంగా ఆరోగ్యకరమైన శిశువు జనన సమయంలో 2.5 కిలోల నుంచి 3.5 కిలోల మధ్య బరువు ఉంటుందని వైద్యులు చెబుతారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన భద్రాచలం ఏరియా ప్రభుత్వాసుపత్రిలో సంథ్యారాణి అనే మహిళ 5 కిలోల 200 గ్రాముల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది.

పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స నిర్వహించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి తల్లీబిడ్డలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

ఇంతటి భారీ బరువుతో శిశువు జన్మించడం చాలా అరుదుగా జరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రిలో ఇలాంటి క్లిష్ట కేసును సమర్థవంతంగా నిర్వహించడంపై ఆసుపత్రి సిబ్బందిని రోగి బంధువులు అభినందిస్తున్నారు.

ఈ సంఘటనతో స్థానికంగా ఆనంద వాతావరణం నెలకొంది. “బాల బీముడు పుట్టాడు”, “బాల హనుమంతుడు పుట్టాడు” అంటూ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793