ఫెయిల్ అవుతానన్న భయంతో ఆత్మహత్య… ఫలితాల్లో ఫస్ట్ క్లాస్
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు అనేక కుటుంబాల్లో ఆనందాన్ని నింపగా… కొన్ని చోట్ల మాత్రం తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ (17) కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. పరీక్షలు రాసిన తర్వాత నుంచి తాను బాగా రాయలేదని, ఫెయిల్ అవుతానని తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ భయం రోజురోజుకూ పెరిగి, చివరకు క్షణికావేశంలో ఈ నెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
కూతురు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో మునిగిపోయారు. కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
అయితే అసలు విషాదం అక్కడితో ఆగలేదు. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాలు చూసిన సాయిప్రియ స్నేహితులు, ఉపాధ్యాయులు షాక్‌కు గురయ్యారు. ఆమె కేవలం పాస్ అవ్వడమే కాకుండా… ఏకంగా 480 మార్కులతో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించింది. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే, ఈ విజయాన్ని చూసి కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండేదని అందరూ వేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫలితాల రోజే మరో విషాదం
వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం సోళీపూర్‌లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భరత్ అనే విద్యార్థి పదో తరగతిలో 441 మార్కులు సాధించి పాస్ అయ్యాడు. ఆనందంతో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు.
ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన భరత్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. వైద్యులు అతను వడదెబ్బ (హీట్ స్ట్రోక్) కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం అలుముకుంది.
విద్యార్థులపై ఒత్తిడి – ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు
చదువులో ఒత్తిడి, ఫెయిల్ అవుతామనే భయం కారణంగా విద్యార్థులు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిపుణులు చెబుతున్నది ఒక్కటే—
- ఓటమి జీవితం అంతం కాదు
- ఫలితాలు తాత్కాలికం… జీవితం శాశ్వతం
- పిల్లల్లో ధైర్యం, నమ్మకం పెంచడం తల్లిదండ్రుల బాధ్యత
ప్రాణం ఉంటేనే విజయాలు సాధ్యమవుతాయి… ఒక ఫలితం కోసం జీవితాన్ని కోల్పోవడం ఎన్నటికీ తిరిగిరాని నష్టం.

Post a Comment