టీచర్ల ప్రమోషన్లకు విద్యాశాఖ కసరత్తు – ప్రత్యేక టెట్ పరీక్షలకు సన్నాహాలు
హైదరాబాద్: ఏప్రిల్ 28: తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్లకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్-సర్వీస్ టీచర్ల పదోన్నతులకు ప్రధాన అడ్డంకిగా మారిన సమస్యలను పరిష్కరించేందుకు విద్యాశాఖ చురుకుగా చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం ఉపాధ్యాయులు ప్రమోషన్ పొందాలంటే తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)లో అర్హత సాధించాల్సిన పరిస్థితి ఉంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది టీచర్లు ఇప్పటికీ టెట్‌లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో పదోన్నతులకు దూరమవుతున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఊరట కలిగించే నిర్ణయాలపై దృష్టి సారించింది. ఈ ఏడాది డిసెంబర్‌లోపు రెండు ప్రత్యేక టెట్ పరీక్షలను నిర్వహించాలనే ప్రతిపాదనను విద్యాశాఖ సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతికి పంపినట్లు సమాచారం.
గతంలో 2011కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఉంటుందని భావించినా, 2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ పరిస్థితి పూర్తిగా మారింది. తాజా నిబంధనల ప్రకారం, ప్రమోషన్ పొందాలంటే ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా టెట్ పాస్ కావాల్సిందే.
అదేవిధంగా, 2027 మార్చి 31 నాటికి టెట్ అర్హత సాధించని ఉపాధ్యాయులు పదోన్నతులకు అనర్హులుగా పరిగణించబడతారని స్పష్టం చేశారు. ఈ కారణంగా టెట్‌లో ఇంకా అర్హత పొందని టీచర్లకు ఈ ప్రత్యేక పరీక్షలు కీలకంగా మారనున్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం సుమారు 1.02 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, వీరిలో దాదాపు 57 వేల మంది టెట్ అర్హత సాధించలేదు. గతంలో నిర్వహించిన టెట్ పరీక్షల్లో సుమారు 30 వేల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇంకా 27 వేల మంది టీచర్లు టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది.
ఇప్పటికే విడుదలైన టెట్ నోటిఫికేషన్ ద్వారా కొంతమందికి అవకాశం లభించనుండగా, మిగిలిన వారికి ఈ ఏడాది నిర్వహించనున్న రెండు ప్రత్యేక టెట్ పరీక్షలు కీలకంగా మారనున్నాయి. దీంతో ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతం కావచ్చని భావిస్తున్నారు

Post a Comment