ఏపీలో వరుస విషాదాలు.. రైలు ఢీకొని నలుగురు మృతి.. సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు
ఏపీలో వరుస విషాదాలు.. రైలు ఢీకొని నలుగురు మృతి.. సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం వరుస విషాద ఘటనలు కలకలం రేపాయి. ఒకవైపు ఏలూరు జిల్లాలో రైలు ఢీకొని నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరోవైపు విశాఖపట్నం తీరంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో చర్లపల్లి–షాలీమార్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక యువకుడు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, విశాఖపట్నం నుంచి ఈ నెల 1న చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు అల్పపీడనం ప్రభావంతో గల్లంతయ్యారు. సముద్రం అల్లకల్లోలంగా మారుతుండటంతో కుటుంబ సభ్యులు వెంటనే తిరిగి రావాలని వారికి సమాచారం అందించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటికి చేరుకుంటామని మత్స్యకారులు ఫోన్‌లో చెప్పినప్పటికీ, అనంతరం వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు.
దీంతో కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన ఆరుగురు, భీమిలి మండలం పెదనాగమయ్యపాలెంకు చెందిన ఒకరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గల్లంతైన మత్స్యకారుల పేర్లు: కే. సీతడు, గరగయ్య, బండియ్య, అమర అప్పలరాజు, మెడ చిన్న అమ్మెరు, కారి చిన్న, కే. చిన్నయ్య.
ఈ రెండు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపాయి. రైలు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, గల్లంతైన మత్స్యకారుల కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి.

Post a Comment