పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: షేఖ్ అబ్దుల్ బాసిత్
నీటిని ఆదా చేయండి.. ప్రకృతిని కాపాడండి! పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: షేఖ్ అబ్దుల్ బాసిత్
రుద్రంపూర్, అక్టోబర్ 16: నీరు జీవకోటికి దేవుడిచ్చిన గొప్ప వరమని, దానిని పరిరక్షించడం ద్వారా తోటి మానవులకు మేలు చేయడమే నిజమైన పుణ్యకార్యమని జమాతే ఇస్లామీ హింద్ సభ్యుడు షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు. నీటి సంరక్షణ, ఆహార వృథా నివారణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.
పవిత్ర శుక్రవారం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మస్జిద్-ఏ-ఖుబాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం తగ్గి నీటి కొరత ఏర్పడుతున్న తరుణంలో, నీటిని విచక్షణారహితంగా వినియోగించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో, మతపరమైన సంస్థల్లో నీటి వృథాను అరికట్టడం కూడా పుణ్యకార్యమేనని స్పష్టం చేశారు.
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
సుమారు 1,500 సంవత్సరాల క్రితమే ప్రవక్త మహమ్మద్ (స) నీటి ప్రాధాన్యతను తెలియజేస్తూ, పారే నీటిని సైతం వృథా చేయకూడదని, నీటి వనరులను కలుషితం చేయకూడదని బోధించారని షేఖ్ అబ్దుల్ బాసిత్ గుర్తుచేశారు. నీరు విలువైన సహజ వనరు అని, దానిని భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు, ఉపయోగించిన నీటిని సాధ్యమైన చోట పునర్వినియోగం చేయాలని, ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాలను పెంపొందించాలని సూచించారు.
చెట్ల సంరక్షణ కూడా ఆరాధనే
చెట్లను నరకడం, ప్రకృతికి హాని కలిగించడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఆయన అన్నారు. చెట్లను నాటడం, వాటిని సంరక్షించడం ద్వారా మనుషులతో పాటు పశుపక్షాదులకు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఒక చెట్టు అనేక జీవులకు ఆహారం, నీడ, ప్రాణవాయువు అందిస్తుందని, అందువల్ల మొక్కలు నాటడం, వాటిని పెంచడం కూడా పుణ్యకార్యంగా భావించాలని పేర్కొన్నారు.
ప్రవక్త మహమ్మద్ (స) బోధనల స్ఫూర్తితో ప్రకృతిని ప్రేమించడం, సహజ వనరులను కాపాడటం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి
ప్లాస్టిక్ వినియోగం, అవసరానికి మించి వాహనాలను ఉపయోగించడం వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యం పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలుష్యం మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, సాధ్యమైన చోట పునర్వినియోగ వస్తువులను ఉపయోగించడం, ఆహారాన్ని వృథా చేయకుండా అవసరమైనంత మాత్రమే తీసుకోవడం వంటి అలవాట్లను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
నమాజ్, రోజా, హజ్ వంటి మతపరమైన ఆచరణలు వ్యక్తిగత ఆరాధనకే పరిమితం కావని, వాటి స్ఫూర్తిలో సహజ వనరుల పరిరక్షణ, బాధ్యతాయుతమైన వినియోగం, తోటి మనుషుల సంక్షేమం పట్ల శ్రద్ధ కూడా అంతర్భాగంగా ఉంటాయని ఆయన వివరించారు.
ప్రకృతిని కాపాడటం, నీటిని ఆదా చేయడం, ఆహార వృథాను అరికట్టడం, ప్లాస్టిక్ను తిరస్కరించడం వంటి చిన్నచిన్న చర్యలే పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని షేఖ్ అబ్దుల్ బాసిత్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మస్జిద్ ఇమామ్ మజ్హర్, అధ్యక్షుడు అజీజ్ ఖాన్, షబ్బీర్, షమీం, సోనూబాయ్, మదార్, రఫీ, మున్నా, షఫీ, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment