సింగరేణి కార్మికుల సమస్యలపై హైదరాబాద్‌లో కీలక సమావేశం
సింగరేణి కార్మికుల సమస్యలపై హైదరాబాద్‌లో కీలక సమావేశం
ఈ నెల 14న రామగుండంలో కేటీఆర్ ఆధ్వర్యంలో ‘సింగరేణి కార్మిక గర్జన’
హైదరాబాద్: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కార్మికుల పరిస్థితి, ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘాల వైఫల్యాలపై చర్చించేందుకు గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 14న రామగుండంలో కార్మిక గర్జన
సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు, ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 14న రామగుండం ఏరియాలో భారీ స్థాయిలో ‘సింగరేణి కార్మిక గర్జన’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నాయకులు పిలుపునిచ్చారు.
కార్మికుల హక్కుల సాధనే లక్ష్యం
‘సింగరేణి పరిరక్షణ – కార్మికుల హక్కుల సాధన’ లక్ష్యంగా రామగుండంలో నిర్వహించనున్న కార్మిక గర్జనను విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ నాయకుడు తుమ్మ శ్రీనివాసరావు కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, కొత్తగూడెం వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, మణుగూరు ఏరియా వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి, జి.కె. సంపత్‌తో పాటు టీబీజీకేఎస్ రాష్ట్ర నాయకులు, వివిధ ఏరియాల సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment