-->

పోలీసు వాహనం, కారును ఢీకొట్టిన ఇసుక లారీ.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

పోలీసు వాహనం, కారును ఢీకొట్టిన ఇసుక లారీ.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి


పోలీసు వాహనం, కారును ఢీకొట్టిన ఇసుక లారీ.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

ములుగు జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల మధ్య అటవీ ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చిన ఇసుక లారీ.. పోలీసు వాహనంతో పాటు ఓ ప్రైవేట్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

తెలిసిన వివరాల ప్రకారం.. ఏటూరునాగారం మండల కేంద్రం నుంచి ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు పోలీసు వాహనంలో ములుగు వైపు వస్తున్నారు. అదే సమయంలో ములుగు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఇసుక లారీ గోవిందరావుపేట–తాడ్వాయి మండలాల మధ్య అటవీ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న పోలీసు వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అనంతరం అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ కారును కూడా లారీ ఢీకొట్టింది.

లారీ ఢీకొనడంతో ప్రైవేట్ కారు ఇసుక లారీ కిందకు దూసుకెళ్లింది. పోలీసు వాహనం అదుపుతప్పి అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ మొగునూరి రమాకాంత్ అక్కడికక్కడే మృతి చెందారు.

మరోవైపు సీఆర్పీఎఫ్ జవాన్లు గిరీష్ కుమార్, ప్రేమ్ ప్రకాష్, రంజాన్ ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేట్ కారులో ప్రయాణిస్తున్న ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ సఫియా కూడా గాయపడినట్లు సమాచారం.

ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలించారు.

ఈ ఘటనపై తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, లారీ వేగం తదితర పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Blogger ఆధారితం.