-->

మాటలు చెప్పడం కాదు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు

 

మాటలు చెప్పడం కాదు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు

మాటలు చెప్పడం కాదు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు

ఎన్‌హెచ్‌ఎం, ఆయుష్‌, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి – ఉద్యోగ భద్రత కల్పించాలి – పెండింగ్‌ జీతాలు, బకాయిలు వెంటనే విడుదల చేయాలి

సిద్దిపేట: మాటలు చెప్పడం కాదని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్‌ ఎదుట ఎన్‌హెచ్‌ఎం (జాతీయ ఆరోగ్య మిషన్‌) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్‌హెచ్‌ఎం, ఆయుష్‌, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆ హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

చాయ్‌ తాగినంత సమయంలో రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చాయ్‌ తాగినంత సమయంలోనే ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చెప్పిన మాటలను హరీశ్‌రావు ప్రస్తావించారు. “రేవంత్‌రెడ్డి చాయ్‌ తాగడం లేదా? చాయ్‌ తాగినప్పుడు సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీ గుర్తుకు రావడం లేదా?” అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడం సరైన విధానం కాదన్నారు.

15వ తేదీ వచ్చినా అందని జీతాలు

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు నెలలో 15వ తేదీ వచ్చినా జీతాలు అందని పరిస్థితి నెలకొందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించినట్లు గుర్తుచేశారు. ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించిన ఘనత ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులదని కొనియాడారు. అలాంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి తగిన గుర్తింపు, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

సమాన పనికి సమాన వేతనం కల్పించాలి

ఎన్‌హెచ్‌ఎం, ఆయుష్‌, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల అర్హతలకు అనుగుణంగా జీపీఎఫ్‌ (GPF), ఈఎస్‌ఐ (ESI), ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు.

ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవడంతోపాటు పెండింగ్‌లో ఉన్న జీతాలు, ఇతర బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్‌హెచ్‌ఎం, ఆయుష్‌, ఈజీఎస్‌, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ మద్దతు

ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటానికి రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదే సమయంలో తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న స్కావెంజర్లకు కూడా ఎమ్మెల్యే హరీశ్‌రావు సంఘీభావం తెలిపారు. కార్మికులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.

Blogger ఆధారితం.