హైదరాబాద్‌లో భారీ దోపిడీ.. మహిళల చేతులు కట్టి, నోటికి ప్లాస్టర్ వేసి రూ.3.20 కోట్లు చోరీ!
హైదరాబాద్‌లో భారీ దోపిడీ.. మహిళల చేతులు కట్టి, నోటికి ప్లాస్టర్ వేసి రూ.3.20 కోట్లు చోరీ!
హైదరాబాద్: నగరంలో భారీ నగదు దోపిడీ కలకలం రేపింది. ఇంట్లోకి చొరబడిన నలుగురు గుర్తుతెలియని ముసుగు దొంగలు ఇద్దరు మహిళలను బంధించి ఏకంగా రూ.3.20 కోట్ల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
మన్సూరాబాద్‌లోని చందేశ్వర్ కాలనీ, రోడ్ నంబర్ 2లో ఉన్న ప్లాట్ నంబర్ 61లోకి శనివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో నలుగురు ముసుగు ధరించిన దుండగులు ప్రవేశించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న సామ మానమ్మ (65), ఆమె కోడలు మౌనికను లక్ష్యంగా చేసుకున్నారు. ఇద్దరు మహిళల చేతులను కట్టేసి, నోళ్లకు ప్లాస్టర్ వేసి కదలకుండా చేశారు.
అనంతరం బెడ్రూమ్లోని బీరువాను బలవంతంగా పగులగొట్టి అందులో భద్రపరిచిన రూ.3.20 కోట్ల నగదును ఎత్తుకెళ్లారు. దోపిడీ అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది.
పెళ్లి కోసం ఇంట్లో నగదు భద్రపరిచినట్లు సమాచారం
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న కొమ్మరవెల్లి సంపత్ కుమార్ రెడ్డి స్థలం కొనుగోలు నిమిత్తం తన బావమరిది కుంభం విజయ్ కుమార్ రెడ్డి ఖాతాకు నగదు పంపించినట్లు సమాచారం. బంధువుల పెళ్లికి వెళ్లాల్సి ఉండటంతో ఈ నెల 22న విజయ్ కుమార్ రెడ్డి ఆ నగదును మన్సూరాబాద్‌లోని సామ ప్రవీణ్ ఇంట్లో భద్రపరిచినట్లు తెలుస్తోంది.
రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో గాలింపు
దోపిడీ ఘటనపై సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తూ దొంగల ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మహిళలను బంధించి పట్టపగలే కోట్లాది రూపాయల నగదును దోచుకెళ్లిన ఈ ఘటన హైదరాబాద్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Post a Comment