అటవీ భూముల్లో అక్రమ గుడిసెల తొలగింపు.. అధికారుల చర్యలు!
అటవీ భూముల్లో అక్రమ గుడిసెల తొలగింపు.. అధికారుల చర్యలు!
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం పరిధిలో అటవీ భూముల్లో నిర్మించిన గుడిసెలను అటవీశాఖ అధికారులు తొలగించారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ (డీఆర్వో) ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ తొలగింపు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా డీఆర్వో ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. అటవీ భూముల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అటవీ భూములను ఆక్రమించడం, చెట్లను నరికివేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వన సంరక్షణే లక్ష్యంగా అటవీ భూములను కాపాడేందుకు నిరంతరం చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
గుడిసెల తొలగింపుపై తండావాసుల అభ్యంతరం
అటవీశాఖ అధికారులు గుడిసెలను తొలగిస్తున్న సమయంలో కొందరు తండావాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము గత 20 ఏళ్లుగా అక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నామని, వాటిలో గొర్రెలు, మేకలు, ఇతర పశువులను మాత్రమే ఉంచుతున్నామని అధికారులకు వివరించారు.
దీనిపై అటవీశాఖ అధికారులు స్పందిస్తూ.. అటవీ భూముల్లో ఉన్న గుడిసెలను తొలగించాలని 20 రోజుల ముందుగానే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో అటవీ సిబ్బందితో కలిసి తొలగింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీవో జ్యోతినాయక్, కానిస్టేబుల్ అరుణ్‌తో పాటు ఐదుగురు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. అటవీ భూముల పరిరక్షణలో భాగంగా అధికారులు చేపట్టిన ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Post a Comment