కవితపై ఆ పదం పొరపాటున దొర్లింది.. విచారం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
కవితపై ఆ పదం పొరపాటున దొర్లింది.. విచారం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. కవితను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో ఒక పదం పొరపాటున దొర్లిందని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్క ఓ వీడియోను విడుదల చేశారు.
ములుగులో చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కవిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తాను ఉపయోగించిన ఓ పదం అనుకోకుండా వచ్చిందని సీతక్క తెలిపారు. కవితను ఉద్దేశపూర్వకంగా ఆ మాట అనలేదని పేర్కొన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని సరిదిద్దుకున్నానని వివరించారు.
కవిత తనకు క్యాన్సర్ ఉందనే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించిన అంశాన్ని ప్రస్తావించే క్రమంలో మాట దొర్లిందని మంత్రి వివరణ ఇచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆమె ఖండించారు.
వరంగల్ పర్యటనలో పెన్షన్ల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రచారాన్ని తాను గట్టిగా తిప్పికొట్టిన నేపథ్యంలోనే తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. తాను వెంటనే సరిదిద్దుకున్న వ్యాఖ్యల వీడియోను బీఆర్ఎస్ శ్రేణులు ఉద్దేశపూర్వకంగా వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నాయని విమర్శించారు.
తాను రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడూ సిద్ధాంతపరంగా, రాజకీయంగానే ఎదుర్కొంటానని సీతక్క స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయడం తన నైజం కాదని, ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యల విషయంలో తన ఉద్దేశాన్ని వివరిస్తూ మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Post a Comment