మహిళా దొంగల ముఠా అరెస్ట్.. 9.5 తులాల బంగారం స్వాధీనం!
మహిళా దొంగల ముఠా అరెస్ట్.. 9.5 తులాల బంగారం స్వాధీనం!
మాయమాటలతో మహిళలను బురిడీ కొట్టించి బంగారు ఆభరణాల చోరీ.. ఇద్దరిపై గతంలో పదుల సంఖ్యలో కేసులు
సికింద్రాబాద్: ప్రజల దృష్టిని మరల్చి, మాయమాటలతో మహిళల నుంచి బంగారు ఆభరణాలను అపహరిస్తున్న ముగ్గురు మహిళల దొంగల ముఠాను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి వివిధ చోరీ కేసులకు సంబంధించిన మొత్తం 9.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 5వ తేదీ రాత్రి నార్త్ లాలాగూడ కూరగాయల మార్కెట్ వద్ద ఓ మహిళను ముగ్గురు నిందితులు లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడ కింద పడివున్న పర్సులో బంగారు బిస్కెట్ ఉందని ఆమెను నమ్మించారు. మరుసటి రోజు ఆ బంగారాన్ని విక్రయించి వచ్చిన డబ్బును పంచుకుందామని మాయమాటలు చెప్పారు. ఈ క్రమంలో అసలు బంగారం స్థానంలో నకిలీ బంగారు బిస్కెట్‌ను బాధితురాలికి అప్పగించి, ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు లాలాగూడ పోలీసులు క్రైమ్ నంబర్ 402/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించారు.
ఈ క్రమంలో శుక్రవారం లాలాపేట్‌లోని కల్లు దుకాణం వద్ద చెల్ల నర్సమ్మ (49), వేముల లక్ష్మి (43), కొమెర అంజలి (45)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చెల్ల నర్సమ్మపై గతంలో 18 కేసులు, వేముల లక్ష్మిపై 17 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
విచారణలో భాగంగా యాదగిరిగుట్ట, ఉప్పల్, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుల నుంచి వివిధ కేసులకు సంబంధించిన మొత్తం 9.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ మహిళా జైలుకు రిమాండ్‌పై తరలించారు.
ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన లాలాగూడ ఇన్స్పెక్టర్ బి. రవికిరణ్, ఎస్ఐ కె. మమతతో పాటు క్రైమ్ సిబ్బందిని చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి అభినందించారు.
ప్రజలకు పోలీసుల సూచన: గుర్తుతెలియని వ్యక్తులు బంగారం, డబ్బు ఆశ చూపిస్తూ మాయమాటలు చెప్పినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు లోనై తమ విలువైన ఆభరణాలను అపరిచితులకు అప్పగించవద్దని సూచిస్తున్నారు.

Post a Comment