రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన భైంసా మున్సిపాలిటీ ఇన్‌చార్జి కమిషనర్
రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన భైంసా మున్సిపాలిటీ ఇన్‌చార్జి కమిషనర్
రూ.2.63 లక్షల పెండింగ్ బిల్లు చెక్కు విడుదలకు లంచం డిమాండ్
నిర్మల్ జిల్లా, నవంబర్ 10:
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వల పన్ని దాడి నిర్వహించారు. రూ.50 వేల లంచం తీసుకుంటూ భైంసా మున్సిపాలిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భైంసా మున్సిపాలిటీలో ఫిర్యాదుదారుడు చేపట్టిన సివిల్ పనులకు సంబంధించి మొత్తం రూ.2,63,128 పెండింగ్ బిల్లు ఉంది. ఈ బిల్లుకు సంబంధించిన చెక్కును విడుదల చేయడానికి జాదవ్ సంతోష్ రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదే క్రమంలో గత అక్టోబర్ 26న కూడా ఫిర్యాదుదారుడి నుంచి రూ.10 వేల లంచం స్వీకరించి, రూ.6.40 లక్షల చెక్కును విడుదల చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. అనంతరం మిగిలిన రూ.2,63,128 చెల్లింపునకు సంబంధించిన చెక్కు విడుదల చేయడానికి మరో రూ.50 వేలు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో నవంబర్ 10న ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించి, లంచం తీసుకున్న సమయంలో జాదవ్ సంతోష్‌ను పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న రూ.50 వేల నగదును ఆయన కారులోని డ్యాష్‌బోర్డులో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డ్యాష్‌బోర్డులో సేకరించిన నమూనాలకు నిర్వహించిన రసాయన పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రభుత్వ విధులను నిజాయితీగా నిర్వహించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ప్రత్యేక ఎస్పీఈ, ఏసీబీ కేసుల న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించింది.
ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచారు.
లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
వాట్సాప్: 9440446106
ఫేస్‌బుక్: Telangana ACB
ఎక్స్ (ట్విట్టర్): @Telangana ACB
ఫిర్యాదుదారుల పేర్లు, వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చని సూచించారు.

Post a Comment