-->

ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండ.. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, తల్లికి ఉద్యోగం

ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తాం – మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన


ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండ.. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, తల్లికి ఉద్యోగం

ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తాం – మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన

హైదరాబాద్‌, నవంబర్ 4: విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున కలిపి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ప్రవళిక తల్లికి ఉద్యోగం కల్పించడంతో పాటు, కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

మణుగూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న గుండ్ల ప్రవళిక (24) గత నెల 25న విధి నిర్వహణలో ప్రమాదానికి గురయ్యారు. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో టికెట్‌ చిల్లర విషయంలో ఓ ప్రయాణికురాలితో ఆమెకు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సదరు ప్రయాణికురాలు ప్రవళికను తోసేయడంతో ఆమె బస్సు నుంచి కిందపడిపోయారు. దీంతో బస్సు వెనుక టైర్లు ఆమె కుడికాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే ఆమెకు స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రికి తరలించారు. అక్కడ సుమారు పది రోజుల పాటు చికిత్స పొందిన ప్రవళిక పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

24 ఏళ్ల చిన్న వయసులోనే ప్రవళిక మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, మణుగూరు ఆర్టీసీ డిపో సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగికి ఇలాంటి దుర్ఘటన జరగడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఆమె కుటుంబానికి ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశాయి.

ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రూ.10 లక్షల ఆర్థిక సాయం, తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించడం బాధిత కుటుంబానికి కొంత ఊరటనిచ్చింది.


Blogger ఆధారితం.