హైదరాబాద్‌లో బురఖా ధరించి చోరీలు.. కొత్తగూడెంకు చెందిన మహిళ అరెస్ట్
హైదరాబాద్‌లో బురఖా ధరించి చోరీలు.. కొత్తగూడెంకు చెందిన మహిళ అరెస్ట్
కోటి రూపాయలకు పైగా విలువైన చోరీ సొత్తు స్వాధీనం.. మహిళతో పాటు మరో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
హైదరాబాద్: నగరంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కోటి రూపాయలకు పైగా విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. శనివారం సికింద్రాబాద్‌లోని మల్కాజిగిరి కమిషనరేట్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కేసుల వివరాలను వెల్లడించారు.
బురఖా ధరించి రెక్కీ.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్
భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి చెందిన పాగా జయ బీటెక్ ప్రథమ సంవత్సరం వరకు చదువుకుంది. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి ఉప్పల్‌లోని భారత్‌నగర్‌లో నివాసం ఉంటోంది. విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
జయ బురఖా ధరించి నగరంలోని వివిధ కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేది. ఆయా ఇళ్లలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత అత్యాధునిక హ్యాండ్ కట్టర్ సహాయంతో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించేది.
ఈ నెల 27న ఉప్పల్ ప్రాంతంలో ఇంటి యజమానులు ఊరికి వెళ్లిన విషయాన్ని గుర్తించిన జయ, వారి ఇంటి తాళాలను హ్యాండ్ కట్టర్‌తో పగులగొట్టి చోరీకి పాల్పడింది. ఈ ఘటనలో 48 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.2 లక్షల నగదును అపహరించింది.
ఈ చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితురాలు జయను గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.70 లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు జయ ఐదు చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని సీపీ తెలిపారు.
12 రోజుల్లో 10 చోరీలు.. మరో నిందితుడి అరెస్ట్
మరో కేసులో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రతిరామ్ తండాకు చెందిన గుగులోతు నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వృత్తిరీత్యా ల్యాబ్ టెక్నీషియన్ అయిన నవీన్‌పై గతంలోనే 18 చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
గత నెల 7న జనగామ జైలు నుంచి విడుదలైన నవీన్, బయటకు వచ్చిన 12 రోజుల వ్యవధిలోనే ఏకంగా 10 దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఏఎస్‌రావు నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న ఫ్లాట్‌ను లక్ష్యంగా చేసుకుని 37 తులాల బంగారాన్ని అపహరించాడు.
ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన కుషాయిగూడ పోలీసులు, సీసీఎస్ బృందాలు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి నవీన్‌ను పట్టుకున్నాయి. అతడి నుంచి చోరీకి గురైన సొత్తును పూర్తిగా రికవరీ చేసినట్లు సీపీ సుమతి వెల్లడించారు.
నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులను సాంకేతిక ఆధారాలతో గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసు బృందాలను సీపీ అభినందించారు. తాళం వేసి ఊళ్లకు వెళ్లే సమయంలో ప్రజలు ఇళ్ల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Post a Comment