కొత్తపేటలో దారుణం.. భార్య చేతిలో భర్త హతం!
కొత్తపేటలో దారుణం.. భార్య చేతిలో భర్త హతం!
హైదరాబాద్: నగరంలోని కొత్తపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన కుటుంబ కలహాలు చివరకు హత్యకు దారితీశాయి. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. కొత్తపేటకు చెందిన ప్రభాకర్‌కు, ఆయన భార్యకు మధ్య ఏదో విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి గురైన భార్య కత్తితో భర్త ప్రభాకర్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రభాకర్‌ను కుటుంబ సభ్యులు వెంటనే కొత్తపేటలోని ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితురాలైన భార్యను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అసలు భార్యాభర్తల మధ్య వివాదానికి కారణమేంటి? ఆ గొడవ హత్యకు దారితీసేంతగా ఎలా ముదిరింది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

Post a Comment