-->

ఇంటి నేల కింద కోట్లాది నగదు.. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు!

 

ప్రయాగ్‌రాజ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ నగదు నిల్వలు.. రూ.60 కోట్లకు పైగా ఉండొచ్చని పోలీసుల అంచనా

 ఇంటి నేల కింద కోట్లాది నగదు.. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు!

ప్రయాగ్‌రాజ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ నగదు నిల్వలు.. రూ.60 కోట్లకు పైగా ఉండొచ్చని పోలీసుల అంచనా

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి నేల కింద ప్లాస్టిక్‌ డ్రమ్ములను పాతిపెట్టి, వాటిలో కోట్లాది రూపాయల నగదును రహస్యంగా దాచిపెట్టిన వ్యవహారం కలకలం రేపుతోంది.

అనుమానంతో బుధవారం రాత్రి పోలీసులు సదరు ఇంటిని చుట్టుముట్టి, ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఇంటి నేలను తవ్వి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నేల కింద పాతిపెట్టిన ప్లాస్టిక్‌ డ్రమ్ములు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.

వాటిని తెరిచి చూడగా.. లోపల కట్టల కొద్దీ కరెన్సీ నోట్లు కనిపించడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మహారాష్ట్రలో పనిచేస్తున్న సమయంలో నోట్ల రద్దు కాలంలో దొంగిలించిన సొమ్ముగా ఈ నగదును అనుమానిస్తున్నారు.

ఇరుగుపొరుగు వారితో జరిగిన ఓ వివాదం కారణంగానే ఇంతకాలం రహస్యంగా ఉన్న ఈ భారీ నగదు నిల్వల విషయం పోలీసుల దృష్టికి వచ్చినట్లు సమాచారం.

ఇప్పటివరకు సుమారు రూ.4 కోట్ల నగదును లెక్కించినట్లు తెలుస్తోంది. మొత్తం నగదు విలువ రూ.60 కోట్లకు పైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి సంబంధించినది? నోట్ల రద్దు సమయంలో జరిగిన చోరీతో దీనికి ఉన్న సంబంధం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి స్థాయిలో నగదు లెక్కింపు, విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Blogger ఆధారితం.