-->

ఆర్టీసీ బస్సులో కండక్టర్‌పై దాడి.. టైర్ కింద పడి తీవ్రంగా గాయపడిన మహిళా కండక్టర్!

 

ఆర్టీసీ బస్సులో కండక్టర్‌పై దాడి.. టైర్ కింద పడి తీవ్రంగా గాయపడిన మహిళా కండక్టర్!

ఆర్టీసీ బస్సులో కండక్టర్‌పై దాడి.. టైర్ కింద పడి తీవ్రంగా గాయపడిన మహిళా కండక్టర్!

చిల్లర విషయంలో వివాదం.. బస్సులో నుంచి కండక్టర్‌ను తోసేసిన ప్రయాణికురాలు

భద్రాచలం ఆసుపత్రికి తరలింపు.. ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్సులో చిల్లర విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘటనకు దారితీసింది. ప్రయాణికురాలితో జరిగిన గొడవలో మహిళా కండక్టర్ బస్సులో నుంచి కిందపడటంతో ఆమె కాలు బస్సు టైర్ కిందపడి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన అశ్వాపురం మండలం మిట్టగూడెం సమీపంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ ప్రవల్లికకు ఓ ప్రయాణికురాలితో వివాదం ఏర్పడింది. ప్రయాణికురాలి కుమారుడికి హాఫ్ టికెట్ తీసుకునే క్రమంలో ఆమె రూ.100 నోటు ఇవ్వగా, టికెట్‌కు సరిపడా చిల్లర ఇవ్వాలని కండక్టర్ కోరినట్లు సమాచారం. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, క్రమంగా గొడవగా మారింది.

ఈ క్రమంలో ప్రయాణికురాలు కండక్టర్ ప్రవల్లికను బస్సులో నుంచి బయటకు తోసివేసినట్లు సమాచారం. దీంతో కిందపడిన ఆమె కాలు బస్సు టైర్ కింద పడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే స్పందించినవారు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో, కండక్టర్‌ను భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు, ఘటనపై సమాచారం అందుకున్న అశ్వాపురం పోలీసులు ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

ఆర్టీసీ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నప్పుడు వారిపై దాడులకు పాల్పడటం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అధికారులు పలుమార్లు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికులు సంయమనం పాటిస్తూ, సమస్యలు తలెత్తినప్పుడు చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.

Blogger ఆధారితం.