-->

ప్రమాదాలకు నిలయంగా మారుతున్న రోడ్డు ఫ్లెక్సీలు.. పట్టించుకోని అధికారులు!

 

ప్రమాదాలకు నిలయంగా మారుతున్న రోడ్డు ఫ్లెక్సీలు.. పట్టించుకోని అధికారులు!

ప్రమాదాలకు నిలయంగా మారుతున్న రోడ్డు ఫ్లెక్సీలు.. పట్టించుకోని అధికారులు!

కొత్తగూడెం పట్టణంలో వాహనదారులకు తప్పని ఇబ్బందులు – జాతీయ రహదారిపై ఫ్లెక్సీల ఏర్పాటుపై ప్రజల ఆందోళన

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో రహదారులపై ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాజకీయ కార్యక్రమాలు, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాల ఆహ్వానాలు, పండుగలు, రాజకీయ పార్టీల ఆవిర్భావ దినోత్సవాలు, ప్రముఖ నాయకుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా రహదారుల పక్కన, కొన్ని చోట్ల రహదారులకు అడ్డంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటంతో ప్రమాదాలు జరిగే ప్రమాదం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణంలోని ప్రధాన రహదారిపై పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడం, మలుపుల వద్ద దృష్టి మరలడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వాహనదారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురై గాయాలపాలైనట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్యక్రమాలు ముగిసినా తొలగించని ఫ్లెక్సీలు

ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు ప్రచారం కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సాధారణంగా మారింది. అయితే కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కూడా వాటిని తొలగించకుండా రహదారులపై వదిలేస్తుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. జాతీయ రహదారిపై కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వాహనదారుల భద్రతకు ముప్పుగా మారుతోందని ప్రజలు చెబుతున్నారు.

అధికారులు స్పందించాలని ప్రజల విజ్ఞప్తి

రహదారులపై ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, రహదారులకు అడ్డంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని, జాతీయ రహదారిపై వాహనదారులకు కనిపించే విధంగా అడ్డంకులు సృష్టించే ఫ్లెక్సీలకు అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వ్యక్తులు, రాజకీయ నాయకులు, నిర్వాహకులు కార్యక్రమాలు ముగిసిన వెంటనే వాటిని తొలగించేలా నిబంధనలు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు అధికారులు తక్షణమే స్పందించి రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తగూడెం పట్టణ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

Blogger ఆధారితం.