వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్
వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్
దసరా సందర్భంగా అభ్యర్థిని ప్రకటించిన తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత
ఎన్నికల కోఆర్డినేటర్, స్టేట్ అబ్జర్వర్‌గా సయ్యద్ ఇస్మాయిల్ నియామకం
హైదరాబాద్: వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దసరా పండుగ శుభ సందర్భంగా పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్ పేరును ఖరారు చేశారు.
ఎన్నికల బాధ్యతలు సయ్యద్ ఇస్మాయిల్‌కు
వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, సమన్వయం కోసం తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్‌ను స్టేట్ పార్టీ అబ్జర్వర్‌గా నియమించారు. ఎన్నికలకు సంబంధించిన సమన్వయ బాధ్యతలను ఆయన పర్యవేక్షించనున్నారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర
డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందినవారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి ప్రారంభ దశ నుంచే కల్వకుంట్ల కవితతో కలిసి పనిచేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా టెలివిజన్ చర్చలు, ప్రజా సంఘాల సమావేశాల్లో తెలంగాణ రక్షణ సేన తరఫున తన వాణిని వినిపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెలంగాణ రక్షణ సేన
తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపించిన అనంతరం తొలిసారిగా శాసన మండలి ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను తొలి అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
బహుజనుల గొంతుకగా వివిధ ప్రజా సమస్యలపై ఉద్యమాలకు రూపకల్పన చేస్తున్న కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలోనూ అదే దిశగా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ రక్షణ సేన తొలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ఎన్నికల బరిలోకి దిగనుండటంతో వరంగల్–ఖమ్మం–నల్గొండ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Post a Comment