చౌటుప్పల్‌లో జోగిని దారుణ హత్య.. 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ!
చౌటుప్పల్‌లో జోగిని దారుణ హత్య.. 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ!
**యాదాద్రి భువనగిరి జిల్లా:** చౌటుప్పల్‌లో దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. జోగినిగా పేరొందిన రాళ్లబండి సుధాకర్ గుర్తుతెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సుధాకర్‌ను అత్యంత క్రూరంగా హత్య చేసిన అనంతరం ఇంట్లో ఉన్న సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదును దోచుకుని అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఆదివారం ఉదయం ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న సుధాకర్‌ను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మృతుడికి గతంలో ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయా? తెలిసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక దోపిడీ కోసమే హత్య చేశారా? అనే కోణాల్లో ఆరా తీస్తున్నారు.
ఘటన జరిగిన ప్రాంతంలోని పరిసర ఇళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల ఆచూకీ గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు.
ఒకవైపు హత్య, మరోవైపు భారీ మొత్తంలో బంగారం, నగదు అపహరణ జరగడంతో చౌటుప్పల్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను త్వరగా గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Post a Comment