-->

మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టిన ప్రయాణికురాలు! చికిత్స పొందుతూ కండక్టర్ మృతి

నేడు మణుగూరు డిపో బంద్ పాటిస్తున్న అన్ని కార్మిక సంఘాలు


మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టిన ప్రయాణికురాలు! చికిత్స పొందుతూ కండక్టర్ మృతి

నేడు మణుగూరు డిపో బంద్ పాటిస్తున్న అన్ని కార్మిక సంఘాలు 

మణుగూరు, నవంబర్ 4: చిల్లర డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం ఓ మహిళా ఆర్టీసీ కండక్టర్ ప్రాణాలను బలిగొంది. చిల్లర ఇవ్వలేదనే కారణంతో మహిళా ప్రయాణికురాలు కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేయడంతో తీవ్రంగా గాయపడిన కండక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన మౌనిక తన కుమారుడితో కలిసి మణుగూరు వద్ద భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. కుమారుడికి టికెట్ తీసుకునేందుకు కండక్టర్ ప్రవళికకు రూ.100 ఇచ్చింది. టికెట్ ధర రూ.10 కావడంతో కండక్టర్ టికెట్ జారీ చేసి, మిగిలిన చిల్లర మొత్తాన్ని టికెట్ వెనుక రాసి ఇచ్చినట్లు సమాచారం.

అయితే తనకు మిగిలిన చిల్లర వెంటనే ఇవ్వాలని మౌనిక కండక్టర్ ప్రవళికతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మౌనిక కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసినట్లు తెలుస్తోంది.

దీంతో ప్రవళిక బస్సు వెనుక టైర్ల కింద పడిపోవడంతో రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రవళిక మృతి చెందారు. చిల్లర విషయంలో జరిగిన చిన్నపాటి వివాదం చివరకు ఓ మహిళా ఉద్యోగి ప్రాణాలు తీసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


Blogger ఆధారితం.