డిఫెన్స్ మద్యం అక్రమ దందా.. భర్తలు తెస్తే, భార్యలు విక్రయం!
ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా.. భర్తలు తెస్తే, భార్యలు విక్రయం!
రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు.. 163 మద్యం బాటిళ్లు స్వాధీనం
హైదరాబాద్: దేశ రక్షణలో సేవలందించి పదవీ విరమణ పొందిన కొందరు మాజీ సైనికులు డిఫెన్స్ క్యాంటీన్ల ద్వారా లభించే మద్యం కోటాను అక్రమ వ్యాపారానికి వినియోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాంటీన్లలో తక్కువ ధరకు లభించే మద్యాన్ని తీసుకొచ్చి, అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. భర్తలు క్యాంటీన్ల నుంచి మద్యం తీసుకురాగా, భార్యలు ఇళ్లలోనే నిల్వ ఉంచి స్థానికంగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆల్వాల్ పరిధిలో సాగుతున్న ఈ అక్రమ దందాపై ఎక్సైజ్ శాఖ కొరడా ఝళిపించింది.
స్టేట్ టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడుల్లో భారీగా డిఫెన్స్ మద్యం పట్టుబడింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో మొత్తం 163 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
లోతుకుంటలో 96 మద్యం బాటిళ్లు స్వాధీనం
మల్కాజిగిరి ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్‌రావు నేతృత్వంలోని అధికారుల బృందానికి సరస్వతీనగర్, లోతుకుంట ప్రాంతంలో డిఫెన్స్ మద్యం అక్రమంగా విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో స్థానికంగా నివాసముంటున్న మన్యం నాగప్రసన్న, రామాంజనేయులు దంపతుల ఇంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 96 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మాజీ సైనికుడైన రామాంజనేయులు తన కోటాతో పాటు ఇతరుల కోటా కింద కూడా క్యాంటీన్ల నుంచి తక్కువ ధరకు మద్యం తీసుకొచ్చి, భార్య నాగప్రసన్న ద్వారా స్థానికంగా విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ఈ కేసులో నాగప్రసన్నను అరెస్ట్ చేసి ఆల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.
న్యూ బోయిన్‌పల్లిలో మరో మహిళ అరెస్ట్
మరోవైపు ఆల్వాల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని న్యూ బోయిన్పల్లి సౌజన్య కాలనీలో ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ సీఐ గణపతిరెడ్డి బృందం తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా కాలనీకి చెందిన ముసిమి లెంక (39) ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 67 డిఫెన్స్ మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయాలకు పాల్పడుతున్న ఆమెను అదుపులోకి తీసుకుని ఆల్వాల్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
రూ.2.11 లక్షల విలువైన మద్యం సీజ్
ఈ రెండు వేర్వేరు దాడుల్లో మొత్తం 163 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.2.11 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
రక్షణ శాఖ మాజీ సైనికులకు కల్పించిన ప్రత్యేక క్యాంటీన్ సదుపాయాలను దుర్వినియోగం చేస్తూ మద్యం అక్రమ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమ వ్యాపారాలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Post a Comment