హైదరాబాద్ - ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంటోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తొలి ఏడాదిలో అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని అన్నారు.
హైదరాబాద్ - ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి
హైదరాబాద్ సిటీ విశ్వ స్థాయిలో "ఫ్యూచర్ సిటీ"గా ఎదుగుతోందని, ఈ నగరం అందించే అవకాశాలను ప్రపంచ వేదికపై మరింత గుర్తింపు పొందేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
దావోస్ పర్యటనకు సన్నద్ధత
జనవరి 20 నుంచి 22 వరకు స్విట్జర్లాండ్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొననున్న సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ, పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పెట్టుబడుల పురోగతిని విశ్లేషించారు.
గత ఏడాది దావోస్ ఒప్పందాల ఫలితాలు
గత ఏడాది దావోస్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం రూ.40,232 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది. మొత్తం 14 ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయి, వీటిలో 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. పది ప్రాజెక్టులు వేగంగా పురోగతిలో ఉండగా, ఏడు ప్రాజెక్టులు అమలులో మొదటి దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సింగపూర్, దావోస్ పర్యటన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 16 నుంచి 19 వరకు సింగపూర్‌లో పర్యటించి, స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలు చేయడం తోపాటు పెట్టుబడులకు సంబంధించిన ఇతర చర్చలు జరపనున్నారు. అనంతరం జనవరి 20 నుంచి 22 వరకు దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.
సదస్సుల ప్రణాళిక
ఈ ఆరు రోజుల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్, సదస్సుల ప్రణాళిక, మరియు వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాల వివరాలను అధికారులు సీఎం గారికి వివరించారు.
తెలంగాణపై ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి
తెలంగాణ ఇప్పటికే పెట్టుబడుల గమ్యస్థానంగా నిలవడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. దేశ విదేశాల్లో పేరుగాంచిన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణలో పెట్టుబడుల మరింత పెరుగుదల కోసం కీలక చర్చలు జరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Post a Comment