కనుమ పండుగ: పశువులకు కృతజ్ఞతలు తెలిపే ప్రత్యేక రోజు
సంక్రాంతి సంబరాలు భారతీయ రైతన్నల ఆనందానికి ప్రతీకగా నిలుస్తాయి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ మూడు రోజుల్లో కూడా కనుమ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని పశువుల పండుగ అని కూడా పిలుస్తారు. ఇది పశువుల పట్ల మన కృతజ్ఞతలను వ్యక్తపరిచే పర్వదినం. రైతుల పంటల యాజమాన్యంలో పశువుల పాత్ర ముఖ్యమైనది. వాటి సేవలు వెలకట్టలేనివి.
పశువుల అలంకరణ - శుభారంభం
కనుమ రోజు, రైతులు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి పసుపు, బొట్టు పెట్టి, గజ్జెలు కడతారు. మెడకు పూల దండలు వేస్తారు. రంగు రంగుల కాగితాలు, రిబ్బన్లు, తోకకు అలంకరణలు చేస్తారు. ఇవి పశువుల పట్ల ఉన్న ఆత్మీయతను చూపుతాయి.
పాతకాల సంప్రదాయాలు
ఒకప్పుడు కనుమ రోజున గ్రామస్తులు అడవిలోకి వెళ్లి ఔషధ వృక్షాలైన నేరేడు, మద్ది, మారేడు, నల్లేరు, మోదుగ వంటి చెట్ల ఆకులు, పూలు, వేర్లు తీసుకొచ్చి వాటిని పొడి చేసి పశువులకు తినిపించేవారు. వీటి ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నమ్మకం ఉండేది.
కాటమరాయుడి పూజ
కనుమ పండుగ రోజున పశువుల దేవుడిగా భావించే కాటమరాయుడిని పూజిస్తారు. ఊరి పొలిమేరలలో ఉండే కాటమరాయుడి గుడికి వెళ్లి మొక్కులు చెల్లిస్తారు. ఈ సందర్భంలో పూజల తర్వాత బలిచ్చిన కోళ్లు, మేకలు వంటివి వండుకుని కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేస్తారు.
సెంటిమెంట్లు, ఆనంద భోజనాలు
భోగి రోజున చిన్నారులకు భోగిపళ్లు పోసినట్లే కనుమ రోజున పశువుల దిష్టి తీస్తారు. ఇలా చేస్తే పశువుల ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం. అలాగే, కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదన్న సెంటిమెంట్ కూడా ఉంది. ఈ రోజు పెద్దల పూజలు, కుటుంబ భోజనాలు నిర్వహించడం ఆనవాయితీ.
ఆహారం - భిన్నత
భోగి, సంక్రాంతి పిండి వంటలతో అలరించగా, కనుమ రోజున మసాలా వంటలతో ఇంటిల్లిపాదికీ విందు సర్వం ఘుమఘుమలతో జరుగుతుంది.
సంక్రాంతి ముగింపు
సంక్రాంతి ముగింపు రోజు అయిన కనుమ, పశువుల పట్ల కృతజ్ఞతను తెలియజేయడమే కాకుండా, కుటుంబ సంతోషాన్ని పంచే పండుగ. పూర్వం పాటించిన సంప్రదాయాలు నేడు తగ్గుముఖం పట్టినా, ఈ పండుగకు ఉన్న ప్రత్యేకత ఎప్పటికీ నిలిచిపోతుంది.

Post a Comment