-->

గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి


హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలోని మీర్‌చౌక్ సమీపంలోని గుల్జార్‌ హౌస్‌ వద్ద జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న బాధితుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకున్నారు.

ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తక్షణమే అన్ని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీస్‌ మరియు అగ్నిమాపక విభాగాల చర్యలపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

గాయపడిన బాధితులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సదుపాయాలు అందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజల ప్రాణాలు మించినవి ఏవీ కావని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాక, సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంలో ఇళ్లను కోల్పోయిన, గాయపడ్డ కుటుంబాలతో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందనీ, వెంటనే సహాయ చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.

ఈ ఘటనపై దగ్గరుండి పర్యవేక్షణ జరిపేందుకు ఐజీ నాగిరెడ్డి ని ప్రత్యేకంగా ఆదేశించారు. సహాయక చర్యల్లో ఏ విధంగా నిర్లక్ష్యం జరగకూడదని, బాధితుల ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.