మామిడికాయ పచ్చడి గొడవ... భార్యను హత్య చేసిన భర్త
పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్: చిన్న కారణం పెద్ద విషాదానికి దారితీసింది. మామిడికాయ పచ్చడి తయారీ విషయంలో తలెత్తిన చిన్నచిన్న మాటల తాడేపాడే ఆఖరికి దారుణ హత్యగా మారింది. ఈ హృదయవిదారక ఘటన పందిళ్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... పందిళ్ల గ్రామానికి చెందిన సూర రాజ్‌కుమార్ (30), సూర అంజలి (27) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం అంజలి మామిడికాయ పచ్చడి తయారు చేయడానికి సిద్ధమైంది. ఈ సందర్భంలో అవసరమైన దినుసుల్లో భాగంగా వెల్లుల్లి కొని రావాలని ఆమె భర్త రాజ్‌కుమార్‌ను కోరింది.
అయితే, ఈ చిన్న విషయాన్నే రాజ్‌కుమార్ పెద్దగా తీసుకుని భార్యతో వాగ్వాదానికి దిగాడు. మాటలు పెరిగి గొడవగా మారాయి. కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్ తన నియంత్రణ కోల్పోయి భార్య అంజలిని గొంతు నులిమి హతమార్చాడు.
ఈ ఘటన గురించి మృతురాలి తండ్రి సంపంగి మల్లేశ్ సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై సూర రాజ్‌కుమార్‌పై హత్య కేసు నమోదు చేశామని, ప్రస్తుతం అతడిని అరెస్టు చేసి విచారణ చేపట్టామని ఎస్సై వెంకటేశ్ తెలిపారు. గ్రామస్థులు ఈ దారుణ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Post a Comment