రామకృష్ణాపూర్‌లో గంజాయి కేసులో ముగ్గురి అరెస్టు – నిందితుల రిమాండ్
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల వినియోగం పై చేపట్టిన కఠిన చర్యల నేపథ్యంలో, ఈరోజు ఉదయం ముగ్గురు యువకులను గంజాయి విక్రయ ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళితే – రామకృష్ణాపూర్ పట్టణ రెండవ ఎస్‌ఐ లలిత తన పోలీసు సిబ్బందుతో కలిసి నేటి ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తూ, రామకృష్ణాపూర్ నుండి అమరావతికి వెళ్లే ప్రధాన రోడ్డులోని ఈద్గా వద్దకు చేరుకున్నారు. అప్పట్లో మూడు అనుమానాస్పద వ్యక్తులు పోలీసులను చూసి పారిపోగా, వెంటనే వెంటాడి పట్టుకుని తనిఖీ చేశారు. వారి వద్ద గంజాయి లభించడంతో స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.
పోలీసుల విచారణలో, నిందితులు మంచిర్యాల జిల్లా రాజీవ్ నగర్‌కు చెందిన తగరపు రాజు అనే వ్యక్తి నుండి నాలుగు రోజుల క్రితం గంజాయి కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారు తాము గంజాయి సేవించిన తర్వాత మిగిలిన గంజాయిని రామకృష్ణాపూర్‌లో అమ్మడానికి వచ్చామని వెల్లడించారు.
తదుపరి విచారణలో వారి వద్ద ఉన్న గంజాయిని తూకం వేయగా, ఒక్కొక్కరి వద్ద 50 గ్రాములు చొప్పున మొత్తం 150 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలు:
- గోలివాడ సాయితేజ (23): ఐటీఐ విద్యార్థి, బెస్త కులానికి చెందినవాడు, మారుతి నగర్, మంచిర్యాల నివాసి.
- గొల్ల శివ (23): కూలీ, నేతకని కులానికి చెందినవాడు, దొర్లాబంగ్లా ఏరియా, మందమర్రి నివాసి.
- తాళ్ళపల్లి అఖిల్ (22): డిగ్రీ విద్యార్థి, మాదిగ కులానికి చెందినవాడు, షీర్కె కాలనీ, మందమర్రి నివాసి.
ఈ ముగ్గురిపై సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రామకృష్ణాపూర్ ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.
అవసరమైన హెచ్చరికలతో పాటు, యువత గంజాయి వలయంలో పడవద్దని, మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలని ఎస్‌ఐ సూచించారు. గంజాయి లేదా మత్తు పదార్థాల వినియోగం, విక్రయంపై గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ విజయం సాధించడంలో రెండవ ఎస్‌ఐ లలిత, హెడ్ కానిస్టేబుల్ జంగు, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, నవీన్ పాత్రను ఎస్‌ఐ రాజశేఖర్ అభినందించారు.
Post a Comment