స్వగ్రామంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలోని ప్రసిద్ధ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించి, భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రవేశ సమయంలో అర్చకులు సీఎం కి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి సన్నిధిలో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుఖసంపదలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. పూజా కార్యక్రమం అనంతరం గ్రామస్థులందరూ సీఎం గారికి ఘన స్వాగతం పలికారు. ఆయన రాకతో గ్రామం పండుగ వాతావరణాన్ని ఏర్పరచుకుంది.
ఈ పవిత్ర కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, లోక్‌సభ సభ్యులు మల్లు రవి, అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Post a Comment