హైడ్రాలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగ యువత భారీగా హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. కారణం – హైడ్రా సంస్థలో డ్రైవర్ పోస్టుల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్. అవుట్సోర్సింగ్ విధానంలో మొత్తం 200 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు హైడ్రా సంస్థ ఇటీవల ప్రకటించింది.
ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభమైంది. ముఖ్యంగా విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పర్యవేక్షణ వంటి విభాగాలకు సంబంధించిన వాహనాలను నడిపేందుకు ఈ పోస్టులు అవసరమవుతున్నాయని హైడ్రా అధికారులు పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని ప్రమాణాలు విధించబడ్డాయి. అభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో అనుభవం ఉండడం కూడా తప్పనిసరి. అంతేకాక, గత సంవత్సరం పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో తక్కువ మార్కులతో అర్హత కోల్పోయిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అందజేసిన అభ్యర్థుల జాబితాలో పేర్లు ఉన్నవారికే దరఖాస్తు చేసే అవకాశం కల్పించబడింది.
దీంతో ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు నిరుద్యోగులు వేల సంఖ్యలో హైడ్రా కార్యాలయాన్ని చేరుకుంటున్నారు. కార్యాలయం వద్ద రద్దీ నెలకొనడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన, ధృవపత్రాల జిరాక్స్, మరియు డ్రైవింగ్ అనుభవం వంటి అంశాలపై స్థానిక సిబ్బంది శ్రద్ధ చూపిస్తున్నారు.
ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందాలన్న ఆశతో యవత ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న తరుణంలో, హైడ్రా నోటిఫికేషన్ వారికి కొత్త ఆశను కలిగించింది. త్వరలోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి, నియామకాలు చేపట్టనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.
Post a Comment