జిల్లా వైద్య అధికారుల సమీక్షా సమావేశం – కఠిన నిబంధనల అమలుపై దృష్టి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయంలో ఈరోజు ఒక కీలక సమావేశం జరిగింది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ ఎల్. భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో, జిల్లాలోని అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థలపై క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం (Clinical Establishments Act) కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ, ‘‘జిల్లాలోని అన్ని ఆసుపత్రులు, క్లినిక్స్, డయాగ్నస్టిక్ ల్యాబ్స్ లాంటి ఆరోగ్య కేంద్రాలు చట్టాన్ని అనుసరించాల్సిన బాధ్యత ఉంది. అగ్నిమాపక భద్రత (Fire Safety Audit) తప్పనిసరి. దీనిలో ఎటువంటి మినహాయింపు ఉండదు. అన్ని కేంద్రాలలో తగిన ప్రమాణాలతో ఫైర్ సేఫ్టీ ఆడిట్‌లు జరగాలి’’ అని స్పష్టం చేశారు. ఈ ఆడిట్‌ల నిర్వహణను వేగవంతం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇంతేకాకుండా, అర్హతలేని వైద్యులు, లేదా తగిన ప్రామాణికాలు లేని పారామెడికల్ సిబ్బందిని నియమించే ఆసుపత్రులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘‘ప్రజల ఆరోగ్యం కాపాడడం ప్రభుత్వ ధర్మం. అందుకే ఎటువంటి రాజీకి తావు లేదు’’ అని డాక్టర్ భాస్కర్ స్పష్టంగా తెలిపారు.
ఈ సమావేశంలో డిప్యూటీ DM&HO డాక్టర్ ఎస్. జయలక్ష్మి, డాక్టర్ ఆర్. పి. చైతన్య, ప్రోగ్రామ్ అధికారులుగా డాక్టర్ మధువరన్, డాక్టర్ పుల్లా రెడ్డి, డాక్టర్ తేజశ్రీ, అలాగే డిప్యూటీ డెమో మొహమ్మద్ ఫైజ్మోహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు జిల్లాలో ఆరోగ్య సేవల ప్రమాణాలను మెరుగుపరచేందుకు తీసుకుంటున్న చర్యలపై కూడా చర్చించారు.
ఈ చర్యలతో జిల్లాలో ఆరోగ్య రంగంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగవుతాయని, ప్రజలకు మరింత విశ్వసనీయ సేవలు అందుతాయని అధికారులు భావిస్తున్నారు.
Post a Comment