-->

అకాల వర్షం పేదవాడి గుడిసే కూల్చేసింది – సహాయం కోరుతున్న బాధితుడు

అకాల వర్షం పేదవాడి గుడిసే కూల్చేసింది – సహాయం కోరుతున్న బాధితుడు


సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఊదిన గాలివాన బీభత్సానికి ప్రజలు తీవ్రంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురు గాలులు, వర్షాలతో పలుచోట్ల రేకులు ఎగిరిపోవడం, చెట్లు నేలకూలడం, విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం వంటి ఘటనలు సంభవించాయి. దాంతో సిద్దిపేట జిల్లా అంతటా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

ఈ పరిణామాల్లో అత్యంత విషాదకరంగా నిలిచింది దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట 9వ వార్డుకు చెందిన జనగామ చంద్రం పరిస్థితి. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న చంద్రం ఇల్లు, ఒక భారీ వేప చెట్టు విరిగిపడటంతో పూర్తిగా ధ్వంసమైంది. తన చిన్న గుడిసె కూలిపోవడం వల్ల కుటుంబంతో కలిసి రోడ్డున పడ్డ ఆయన, శరణార్థిలా జీవితం గడపాల్సిన పరిస్థితిలో ఉన్నారు.

వర్షం వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. దుబ్బాక తహసీల్దార్ ఈ. సంజీవ్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్ఐ హరికిషన్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదేవిధంగా, మండలంలోని హబ్సిపూర్ పిట్టలవాడలోని ఏడు గుడిసెలు పాక్షికంగా ధ్వంసమైనట్లు ఎమ్మార్వో సంజీవ్ కుమార్ తెలిపారు.

ఈ ఘటన నేపథ్యంలో చంద్రం ప్రభుత్వాన్ని తనకు ఆశ్రయం కల్పించాలని, తక్షణ నివాస సాయంతో పాటు పునరావాసం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు త్వరితగతిన స్పందించి అవసరమైన సహాయం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Blogger ఆధారితం.