ఇందిరా సౌర గిరిజన వికాస పథకానికి శుభారంభం సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరా సౌర గిరిజన వికాస పథకానికి శుభారంభం సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రైతుల అభివృద్ధికి గట్టి అడుగు వేసింది ప్రభుత్వం. పోడు భూములను వ్యవసాయోత్పత్తికి అనువుగా మార్చి, ఆదాయ మార్గాలను విస్తరించేందుకు ఉద్దేశించిన "ఇందిరా సౌర గిరిజన వికాస పథకం" నేడు అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ప్రారంభించారు.
ఈ పథకాన్ని రూ.12,600 కోట్ల భారీ వ్యయంతో అమలు చేయనున్నారు. ముఖ్యంగా చెంచు గిరిజనుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ పథకం ద్వారా వారికి సౌర విద్యుత్ ఆధారిత సాగు సౌకర్యాలు ఉచితంగా అందించనున్నారు.
పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా, 23 మంది చెంచు గిరిజన రైతులకు సౌర ప్యానెళ్లు మరియు సోలార్ పంప్ సెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సౌకర్యాల ద్వారా గిరిజన రైతులు నీటి కొరత సమస్యను అధిగమించి, ఖర్చులు తగ్గించుకుని మంచి దిగుబడిని సాధించగలరని అధికారులు తెలిపారు.
ఈ పథకం ముఖ్యంగా ROFR (Recognition of Forest Rights) పట్టాలు కలిగిన గిరిజన రైతులకు వర్తించనుంది. వచ్చే ఐదేళ్లలో దాదాపు 2.10 లక్షల మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరేలా పథకం రూపుదిద్దుకుంది. ప్రథమ దశలో 10 వేల గిరిజన రైతుల కు చెందిన 27,184 ఎకరాల భూములను అభివృద్ధి చేయనున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "గిరిజనుల హక్కులు పరిరక్షించడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందిరా సౌర పథకం ద్వారా గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపాలని ఆశిస్తున్నాం" అని తెలిపారు.
అంతకుముందు, సీఎం తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమంపై తీసుకుంటున్న చర్యల్లో ఈ పథకం ఒక మైలురాయిగా నిలవనుంది.
Post a Comment