-->

ఆపరేషన్ సింధూర్" ద్వారా శత్రువు స్థావరాలపై విజయంపై హర్షం

 

ఆపరేషన్ సింధూర్" ద్వారా శత్రువు స్థావరాలపై విజయంపై హర్షం

భారత సైన్యం "ఆపరేషన్ సింధూర్" ద్వారా శత్రువు స్థావరాలపై విజయం – ఉగ్రవాదంపై ఖడ్గంగా భారత్

భద్రాద్రి కొత్తగూడెం: ఉగ్రవాదానికి గట్టి సమాధానం ఇవ్వడం ద్వారా భారత్ తన హక్కును వినియోగించుకున్నదని, దేశ భద్రత విషయంలో అంతర్జాతీయ సమాజానికి స్పష్టమైన సందేశం పంపినదని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్ఆర్సీ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు డా. మారెళ్లి విజయ్ కుమార్ అన్నారు.

"ఆపరేషన్ సింధూర్" విజయవంతంగా అమలై, శత్రువు స్థావరాలను ధ్వంసం చేయడం పట్ల ఆయన భారత ప్రధాని  నరేంద్ర మోదీకి, భారత సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పినట్లయిందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు ఇది హెచ్చరికగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన భారతీయులకు ఇది నిజమైన నివాళిగా మారిందన్నారు. "భారత సైన్యం ఉగ్రవాద మూకలకు గుణపాఠం నేర్పింది. వారి ధైర్య సాహసాలు మనందరినీ గర్వపడేలా చేస్తున్నాయి. భగవంతుడు వారికి మరింత శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని కోరుతున్నాం," అని తెలిపారు.

ఈ సందర్భంగా, యుద్ధంలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కల్లితండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ వీరమరణం చెందడం దురదృష్టకరమన్నారు. "భరతమాత ఒడిలో ప్రాణాలు అర్పించిన ఈ తెలుగు వీరుడికి జోహార్లు. మురళీ నాయక్ రక్తం భారత మాత నుదిటిపై సింధూరంగా మెరిసిపోతోంది," అని అన్నారు.

భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, దేశ భద్రతకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.


Blogger ఆధారితం.