హైదరాబాద్‌లో అనుమానాస్పద మృతి: పబ్ పార్టీ అనంతరం యువకుడి మృతితో ఉద్రిక్తత
హైదరాబాద్ నగరంలోని కాంప్లీక్స్, నైట్‌లైఫ్ ప్రాంతాలుగా పేరుగాంచిన కొండాపూర్‌లో ఓ యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, సికింద్రాబాద్‌లోని ఓ ఎయిర్ కండిషనింగ్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి శనివారం రాత్రి కొండాపూర్ ప్రాంతంలో ఉన్న “క్వాక్ పబ్”లో పార్టీ చేసుకున్నాడు. మద్యం సేవిస్తూ స్నేహితులతో సరదాగా గడిపిన ఆయన, అర్ధరాత్రి తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు.
అపార్ట్‌మెంట్‌కు వచ్చాక కూడా మద్యం సేవించినట్టు సమాచారం. అనంతరం తెల్లవారుజామున హర్షవర్ధన్‌కి తీవ్ర వాంతులు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో అతని స్నేహితులు వెంటనే AIG ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ హర్షవర్ధన్ మృతి చెందాడు. మృతదేహాన్ని పరీక్షించిన వైద్యులు కారణంపై స్పష్టత ఇవ్వలేకపోయారు.
ఈ నేపథ్యంలో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్షవర్ధన్ మృతిని అనుమానాస్పదంగా భావించిన రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పార్టీ సమయంలో ఏవైనా మత్తు పదార్థాలు తీసుకున్నారా? లేక ఇతర కారణాల వల్ల మృతిచెందాడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు విచారణ తరువాత తెలియనున్నాయి.
Post a Comment