-->

డెంగ్యూ డేంజర్ బెల్స్! వానకాలంలో అప్రమత్తంగా ఉండాలి

డెంగ్యూ డేంజర్ బెల్స్! వానకాలంలో అప్రమత్తంగా ఉండాలి


హైదరాబాద్‌: వానకాలం ప్రారంభానికి ముందు తెలంగాణలో ప్రజల ఆరోగ్యంపై ముప్పుగా మారుతున్న డెంగ్యూజ్వరం మరోసారి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మున్ముందు నెలలుగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఈడిస్‌ దోమల పెంపకం, వాటి వల్ల వ్యాప్తి చెందే డెంగ్యూ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గతంలోనే డెంగ్యూకు సంబంధించిన కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. 2023లో రాష్ట్రవ్యాప్తంగా 10,077 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదుకాగా, 2022లో 8,972, 2021లో 8,016 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ పెరుగుతున్న గణాంకాలు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తేల్చిపెడుతున్నాయి.

ప్రభుత్వం స్పందన

డెంగ్యూ వ్యాప్తి నివారణకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సైతం ముందస్తు చర్యల్లో భాగంగా శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలను చేపట్టింది.

ఈడిస్‌ దోమ – డెంగ్యూ కారకుడు

డెంగ్యూ వ్యాధిని ఈడిస్‌ ఈజిప్టై అనే ప్రత్యేక రకమైన దోమ వ్యాపింపజేస్తుంది. ఇది ఎక్కువగా పగటిపూట కుడుతుంది. వర్షాకాలంలో నీరు నిలిచే ప్రదేశాల్లో ఈ దోమలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో బకెట్లలో, కూలర్‌లలో, పానీ కెన్‌లలో నిల్వ ఉండే నీరు ఈ దోమల పెంపకానికి మార్గం అవుతుంది.

ఈ దోమ కుడితే అధిక జ్వరంతో పాటు తలనొప్పి, కీళ్లనొప్పులు, శరీరంపై ఎర్ర మచ్చలు, వాంతులు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూలో అత్యంత ప్రమాదకరమైన రూపం “డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్”, ఇది ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, బలహీన రోగనిరోధకశక్తి కలిగినవారు అత్యధిక ప్రమాదంలో ఉంటారు.

కంచర్ల గ్రామంలో డెంగ్యూ కేసు

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో ఓ వ్యక్తికి డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయింది. అతనికి వారం రోజులుగా జ్వరం ఉండటంతో వైద్యులు రక్తపరీక్షలు నిర్వహించగా డెంగ్యూ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతను ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గ్రామస్తుల్లో ఆందోళన రేపుతోంది.

డెంగ్యూపై జాగ్రత్తలు

ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. దోమలు పెరిగే అవకాశమున్న ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి. వారానికి ఒక రోజు ఇంటి చుట్టూ నిల్వ నీరు ఉందా లేదా అని తనిఖీ చేయాలి. తలుపులు, కిటికీలకు దోమతెరలు బిగించాలి. చిన్న పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

వానకాలం ప్రారంభానికి ముందే డెంగ్యూపై జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. పరిశుభ్రత పాటించడం, అవగాహన కలగజెప్పడం ద్వారా ఈ ప్రమాదకర వ్యాధిని నియంత్రించవచ్చు. ప్రభుత్వం, వైద్య శాఖలు, ప్రజలు కలిసి చొరవ చూపినప్పుడే డెంగ్యూతో సమర్థవంతంగా పోరాడటం సాధ్యమవుతుంది.

Blogger ఆధారితం.