-->

వేతనాల పెంపు కోరుతూ ప్రైవేట్ బస్సు డ్రైవర్ల ధర్నా రెండో రోజుకు సమ్మె

వేతనాల పెంపు కోరుతూ ప్రైవేట్ బస్సు డ్రైవర్ల ధర్నా రెండో రోజుకు సమ్మె


మంథని పట్టణంలోని ప్రైవేట్ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు వేతనాల పెంపు కోసం చేపట్టిన ధర్నా మంగళవారం రెండో రోజుకు చేరింది. మంథని డిపో పరిధిలో పనిచేస్తున్న ప్రైవేట్ బస్సు డ్రైవర్లు వేతనాలు పెంచాలంటూ దీక్షకు దిగారు. ఇప్పటికే తమ అవసరాలకు సరిపడని జీతాలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని, ప్రతిరోజూ 12 గంటల పైగా పని చేసినా సరైన పారితోషికం లభించడం లేదని వారు వాపోయారు.

ఈ సందర్భంగా ప్రైవేట్ డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు కేతిరి మహేష్ మాట్లాడుతూ, “ప్రస్తుతం మాకు అందుతున్న వేతనం బహుదా తక్కువ. ఎటువంటి వేతన సవరణ లేకుండా యాజమాన్యం మనపై శ్రమను మోపుతుంది. ఇది ఒక రకంగా వెట్టిచాకిరికి సమానం” అని ఆవేదన వ్యక్తం చేశారు.

సమ్మెకు ముందు యాజమాన్యానికి నోటీసు ఇచ్చినా, వారు పరిచయం ఉన్న ఇతర డ్రైవర్లను ఉపయోగించి బస్సులు నడిపించుకుంటూ తాము న్యాయంగా చేస్తున్న సమ్మెను కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. రెండు సంవత్సరాలకోసారి వేతన సవరణ జరగాల్సిన నిబంధన ఉన్నా, ప్రైవేట్ బస్సు యాజమాన్యం దానిని పూర్తిగా విస్మరించిందని ఆయన పేర్కొన్నారు.

డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు యాజమాన్యం చర్చలకు రావాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఈ ధర్నాలో యూనియన్ ఉపాధ్యక్షుడు వైద్య శ్రీనివాస్, కార్యదర్శి కోరవేన సతీష్, కోశాధికారి మహమ్మద్ అప్సర్, బండి రాకేష్, కార్యవర్గ సభ్యులు పి. రాజయ్య, ఏ. కోటీశ్వరరావు, ఏ. నరేష్, ఏ. శ్రీకాంత్, బి. అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుతం సమ్మె కొనసాగుతుండటంతో మంథని ప్రాంతంలో బస్సుల రాకపోకలపై ప్రభావం పడుతోంది. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

Blogger ఆధారితం.