హైదరాబాద్ ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
హైదరాబాద్ ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
హైదరాబాద్, నగరంలో కురుస్తున్న అకాల వర్షాల ప్రభావం, ముంపు సమస్యలను స్వయంగా సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మిక పర్యటన నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా బల్కంపేట, బుద్ధనగర్, మైత్రీవనం వంటి లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
బల్కంపేట బస్తీ, మైత్రీవనంలోని గంగూబాయ్ బస్తీలలో స్థానికులతో సీఎం మాట్లాడి సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, కాల్వల పరిస్థితిపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు.
బుద్ధనగర్‌లో డ్రైన్ సిస్టంను పరిశీలించిన సీఎం, కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎత్తుగా ఉండటం వల్ల నీటి ప్రవాహం అడ్డంకులు ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. వెంటనే డ్రైనేజీ వ్యవస్థను సక్రమం చేయాలని, వరదనీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు. గంగూబాయి బస్తీ కుంటను కొందరు పూడ్చి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని స్థానికుల ఫిర్యాదుపై, ఆ ప్రాంతాన్ని సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మైత్రీవనం వద్ద నిలిచిపోయిన వరదనీటి సమస్యపై కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీసు ఉన్నతాధికారులు, జలమండలి అధికారులు పాల్గొన్నారు. పర్యటనలో బుద్ధనగర్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థి జస్వంత్ తన ఇంటి పరిస్థితి వివరించి, వరదనీటితో పుస్తకాలన్నీ పాడైనట్లు తెలిపాడు. దీనిపై భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Post a Comment