ఉదయం వివాహం.. రాత్రికి ఉరేసుకుని ఆత్మహత్య
పెళ్లి రోజే విషాదం: శ్రీ సత్యసాయి జిల్లా: కొత్త జీవితాన్ని ప్రారంభించిన అదే రోజున దుఃఖాంతం చోటు చేసుకుంది. కాళ్లపారాణి పూర్తికాకముందే ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లిలో చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం, సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత (22)కు కర్ణాటకలోని బాగేపల్లి తాలూకా దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది. వివాహం అనంతరం అదే గ్రామంలో కొత్తదంపతుల మొదటిరాత్రి వేడుక కోసం బంధువులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా.. హర్షిత తన గదిలోకి వెళ్లింది.
కొద్ది సేపటికి ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గదిని తలుపు తట్టారు. ప్రతిస్పందన లేకపోవడంతో తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లిన వారు ఆమెను పైకప్పున ఉరివేసుకుని కనిపించారు. వెంటనే హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. హర్షిత ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు తెలియరాలేదు. ఎలాంటి సూసైడ్ నోట్ కూడా దొరకలేదని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై రమేశ్‌బాబు వెల్లడించారు. ఇంకా ఎవరైనా ఫిర్యాదు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
Post a Comment