కోతుల బెడదకు బాలుడి తెలివైన పరిష్కారం చింపాంజీ మాస్క్‌తో షాక్ ఇచ్చిన బుడతడు
గ్రామంలో నివసించే ప్రజలు కోతుల దాడులతో ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల తోటలు, పండ్ల మొక్కలు నాశనం కావడం, ఇంట్లోకి చొరబడి ఆహార పదార్థాలు అపహరించడం, చిన్న పిల్లలను భయపెట్టడం నిత్యకృత్యంగా మారింది. అధికారులకూ ఫిర్యాదులు చేసినా ప్రభావం లేకపోవడంతో, గ్రామస్థులు విసిగిపోయారు.
ఈ నేపథ్యంలో, మోతే గ్రామానికి చెందిన చిన్నారి రుషి ఓ గొప్ప ఆలోచనతో ముందుకొచ్చాడు. ఇటీవల కామారెడ్డిలో జరిగిన ఎగ్జిబిషన్ సందర్శనలో చింపాంజీ మాస్క్‌ను చూశాడు. రూ.50కు కొనుగోలు చేసిన ఆ మాస్క్‌ను తన ప్రయోగానికి ఉపయోగించాడు.
చింపాంజీలు సహజంగా కోతులకు శత్రువులని తెలిసిన రుషి, ఆ మాస్క్‌ను ధరించి కోతుల మధ్యకు గెంతుకుంటూ వెళ్లి అరవడం ప్రారంభించాడు. వింత వేషధారణ చూసిన కోతులు తీవ్ర భయంతో పరుగులు పెట్టాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతం ఖాళీ అయిపోయింది.
ఈ వినూత్న ప్రయత్నం విజయవంతమవడంతో రుషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. "అంత చిన్నవాడైనా పెద్దవాళ్లకూ బుద్ధి చెప్పేలా చేసాడు," అంటూ పలువురు వాఖ్యానిస్తున్నారు. ఇప్పుడీ చిట్టి చింతకాయ గ్రామంలో హీరోగా మారాడు.
Post a Comment