సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు.. రూ.547 కోట్ల హవాలా లావాదేవీలు వెలుగులోకి
సత్తుపల్లి, జనవరి 11: సత్తుపల్లి కేంద్రంగా పనిచేస్తున్న భారీ సైబర్ క్రైమ్ ముఠాను ఖమ్మం జిల్లా పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ ముఠా ద్వారా రూ.547 కోట్లకు పైగా హవాలా లావాదేవీలు జరిగినట్లు ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేయగా, మరో ఆరుగురు పరారీలో ఉన్నారని తెలిపారు.
ఆదివారం పెనుబల్లి మండలం వీఎం బంజర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీ సునీల్ దత్ వివరాలు వెల్లడించారు. గత ఏడాది 2025 నవంబర్ 24న వేంసూరు మండలం తుంబూరు గ్రామానికి చెందిన మోదుగు సాయికిరణ్కు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మించి, పలు బ్యాంకుల్లో అకౌంట్లు తెరిపించి, అతని పాస్‌బుక్, ఏటీఎం కార్డుల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు పెనుబల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కేసు దర్యాప్తును సత్తుపల్లి రూరల్ సీఐ ఎన్.వి. ముత్తి లింగం, కల్లూరు ఏసిపి వసుంధర యాదవ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం చేపట్టింది. దర్యాప్తులో సత్తుపల్లి మండలానికి చెందిన ఆరుగురు, వేంసూరు మండలానికి చెందిన 11 మందిని ఏజెంట్లుగా నియమించి, వారి ఖాతాల్లోకి సైబర్ నేరాల ద్వారా వచ్చిన నగదును బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
10 దేశాల్లో విస్తరించిన సైబర్ మోసం
ఈ ముఠా సుమారు 10 దేశాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి, పెట్టుబడులు, మ్యాట్రిమోని, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేర్లతో వందలాది మందిని మోసగించినట్లు తెలిపారు. టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా బాధితులను ఆకర్షించి, మోసపూరిత లింకులు పంపి వారి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేసినట్లు వెల్లడించారు.
సైబర్ నేరాల ద్వారా వచ్చిన నగదును మొదట ఏజెంట్ల ఖాతాల్లోకి బదిలీ చేసి, అనంతరం కరెంట్ అకౌంట్ల ద్వారా యూఎస్ డాలర్లు, క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చి, చివరకు తమ వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించినట్లు సీపీ వివరించారు.
ఖాతాల వారీగా భారీ లావాదేవీలు
ఈ కేసులో గుర్తించిన ముఖ్యమైన ఖాతాలు ఇవే:
- పోట్రు మనోజ్ కళ్యాణ్ – రూ.114.18 కోట్లు
- ఉడతనేని వికాస్ చౌదరి – రూ.80.41 కోట్లు
- మేడ భానుప్రియ – రూ.45.62 కోట్లు
- మేడ సతీష్ – రూ.135.48 కోట్లు
- బొమ్మిడాల నాగలక్ష్మి – రూ.81.72 కోట్లు
- నరసింహ కిరాణా అండ్ డైరీ (కరీంనగర్), తాటికొండ రాజు – రూ.92.54 కోట్లు
మొత్తంగా ఏడుగురు ఖాతాల్లో రూ.547 కోట్ల హవాలా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
మరిన్ని అరెస్టులు తప్పవు
ఇప్పటివరకు 17 మంది నిందితులను అరెస్టు చేసినట్లు, మరో ఆరుగురు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో పట్టుకుంటామని సీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 10 దేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని, మరికొందరు నిందితులు అరెస్టయ్యే అవకాశముందని పేర్కొన్నారు.
వేగవంతమైన దర్యాప్తు చేపట్టిన ఏసిపి వసుంధర యాదవ్ ఐపీఎస్, సీఐ ఎన్.వి. ముత్తి లింగంతో పాటు పోలీస్ సిబ్బందిని సీపీ సునీల్ దత్ అభినందించారు.

Post a Comment