మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి : ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
హైదరాబాద్, జనవరి 12, 2026: రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
సోమవారం ఆయన మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ, ఫోటో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష చేపట్టారు.
ప్రధాన కార్యదర్శి పేర్కొన్న అంశాలు:
జనవరి 12న ఫోటో ఓటర్ల తుది జాబితా ప్రకటన
జనవరి 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిశీలన అనంతరం
జనవరి 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల
అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్‌లను గుర్తించి పనులు పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రకటించే నాటికే అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలి అని ఆదేశించారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సర్వైలెన్స్ బృందాలు, సెక్టోరియల్ అధికారులు, నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు.
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment